Tuesday, May 8, 2012

మూడేళ్ల డిగ్రీ విద్యార్థులకు ఐఎస్‌బీలో అవకాశం


మరింతమంది విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిబంధనలను సరళతరం చేయనుంది. మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులనూ అకడెమిక్ అసోసియేట్స్(ఏఏ), రీసెర్చ్ అసోసియేట్స్(ఆర్‌ఏ) గా నియమించుకోనుంది. విదేశాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను చేయాలనుకునేవాళ్లను సాధారణంగా ఐఎస్‌బీ ఏఏ, ఆర్‌ఏలుగా నియమించుకుంటోంది.

ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను దిగ్గజ కాలేజీల నుంచి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లలో బ్యాచిలర్ డిగ్రీ చేసినవారికీ విస్తరించే ప్రణాళికల్లో ఉన్నామని ఐఎస్‌బీ సీనియర్ అసోసియేట్ డీన్ (ఫ్యాకల్టీ, రీసెర్చ్) సంజయ్ కల్లాపూర్ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసిన పోస్ట్‌గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే అమలవుతోంది.

ఐఐటీ, ఐఐఎం తదితర పేరొందిన సంస్థల నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా అసోసియేట్స్‌ను ఐఎస్‌బీ నియమించుకుంటోంది. వీళ్లు ఫ్యాకల్టీకి సహకరిస్తారు. కాగా, కొత్త విధానంలో బ్యాచిలర్ డిగ్రీ చేసేవాళ్లు కూడా మూడో సంవత్సరంలో ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుందని కల్లాపూర్ చెప్పారు.

ఎడ్‌సెట్‌కు 1.45 లక్షల దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి 1.45 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎడ్‌సెట్-2012 కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 28తో ముగిసిందని చెప్పారు. సోషల్ విభాగంలో అత్యధికంగా 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 650 బీఈడీ కళాశాలల్లో 65,000 సీట్లను జూన్ 8న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

మే 22వ తేదీ నుంచి హాల్‌టిక్కెట్ల జారీ ప్రారంభమవుతుంది. విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ఈ సమాచారం అందుతుంది. వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.

సివిల్స్‌కు ఏపీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఏపీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ప్రకటన విడుదల చేశారు. పుస్తకాలు, వసతి, భోజనం, ఇతర సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు మే 25లోపు సమర్పించాలన్నారు.

గ్రూప్-1పై పిటిషన్ల కొట్టివేత
గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నపత్రంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ.. దాఖలైన పిటిషన్లను రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) కొట్టివేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ యతిరాజులు, సభ్యులు ఏకే.గోయల్‌ల నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

గ్రూప్-1 మెయిన్స్ తెలుగు ప్రశ్నపత్రంలో దొర్లిన అనువాద దోషాలతో 350 మార్కులను కోల్పోయామని పేర్కొంటూ వందలాదిమంది అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రిబ్యునల్‌లో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అనువాదాల్లో ఎటువంటి తప్పులు దొర్లలేదని, జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల మేరకే జరిగిందని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది తె లిపారు.

ఈ నేపథ్యంలో... ఏపీపీఎస్సీ వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్ అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసినట్లు సమాచారం.

రాష్ట్రానికి 7 ఏఎన్‌ఎం, 7 జీఎన్‌ఎం స్కూళ్లు
రాష్ట్రానికి 11వ ప్రణాళిక నిధుల తో 7 ఏఎన్‌ఎం(ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ), 7 జీఎన్‌ఎం(జనరల్ నర్స్ మిడ్‌వైఫరీ) స్కూళ్లు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా 269 జిల్లాల్లో 132 ఏఎన్‌ఎం, 137 జీఎన్‌ఎం కాలేజీలను మంజూరు చేయగా.. అందులో మన రాష్ట్రానికి 14 దక్కాయి. ఈ కాలేజీలను తిరుపతి, కాకినాడ, ఏలూరు, నరసాపురం, ఒంగోలు, విజయవాడ, కరీంనగర్‌లలో ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఏఎన్‌ఎం కాలేజీకి రూ. 5 కోట్లు, జీఎన్‌ఎం కాలేజీకి రూ. 10 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి.

ఎండీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ ఏప్రిల్ 29న ప్రారంభమైంది. మొత్తం 203 సీట్లున్నాయి. తొలిరోజు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 135 మంది హాజరవగా, 102 సీట్లు భర్తీ అయ్యాయి. ఫస్ట్ ర్యాంకర్ యలమంచిలి ప్రియాంక హైదరాబాద్ డెంటల్ కళాశాలలోని కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ సీటు తీసుకున్నారు. ఆమెకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.వేణుగోపాలరావు, కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ టి.మురళీమోహన్‌లు ప్రవేశ అనుమతి పత్రాలు అందజేశారు.

ముస్లిం ఎస్సై అభ్యర్థుల పరుగు తేదీలో మార్పు
ఎస్సై(సివిల్), ఎస్‌పీఎఫ్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థులకు రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని వారికి నిర్వహించే ఐదు కిలోమీటర్ల పరుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ ఆరో జోన్‌కు సంబంధించిన అభ్యర్థులకు తొలుత జూలై 20 నుంచి ఆగస్టు 21 వరకు పరుగు పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మారిన తేదీల ప్రకారం- ముస్లిం అభ్యర్థులకు పరుగు పరీక్షను సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు.

మే నెలలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్
పోస్ట్ పరీక్ష తేదీ
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ మే 6
గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్ మే 6
అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్ మే 12
సర్వేయర్స్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ మే 12
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్స్ మే 13
కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్స్ గ్రేడ్-2 మే 20
గ్రూప్-1 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ మే 27

నానో టెక్నాలజీ కోర్సును అందిస్తున్న వర్సిటీలు?


బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. దీంతోపాటు అనుబంధంగా చేసే షార్ట్ టర్మ్ కోర్సులను తెలపండి? -నిఖిల్, కరీంనగర్

ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు తమ డిగ్రీలకు అదనపు అర్హతలు సమకూర్చుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో వారు ముందుగా కంప్యూటర్ కోర్సులపై దృష్టి సారిస్తే.. పరిజ్ఞానంతోపాటు ఉద్యోగ సాధనలో కూడా అవి తోడ్పడతారుు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు పలు షార్ట్‌టర్మ్ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నారుు.

యునిక్స్, లినక్స్, ఎంఎస్ ఆఫీస్, వెబ్ డిజైనింగ్, ఈ- కామర్స్, ఇంటర్నెట్ ఆపరేషన్స్, మల్టీ మీడియూ, వెబ్ డిజైనింగ్, యూనిమేషన్ ప్రస్తుతం క్రేజ్... కెరీర్ స్కోప్ ఉన్న షార్ట్‌టర్మ్ కోర్సులు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులకు పైకోర్సులతోపాటు సి, సి++, డేటాస్ట్రక్చర్, ఆటో క్యాడ్, జావా వంటి కోర్సులు కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తారుు.

వీటితోపాటు వేగంగా గ్రహించే శక్తి, విశ్లేషణ సామర్థ్యం ఉన్న విద్యార్థులకు ఒరాకిల్, జావా, టెస్టింగ్ టూల్స్.. శాప్, పీపుల్ సాఫ్ట్ వంటి ఈఆర్‌పీ సొల్యూషన్స్ అనుకూల కోర్సులు. ఎన్‌ఐఐటీ, అప్‌టెక్ వంటి పలు ప్రైవేట్ సంస్థలు ఈ తరహా కోర్సులను ఆఫర్ చేస్తున్నారుు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రంగమేదైనా.. ఎంట్రీ లెవల్ పోస్టరుునా..ఉన్నత స్థానమైనా..ఏ ఉద్యోగానికైనా ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో డిగ్రీ స్థారుులోనే ఇంగ్లిష్ పరిజ్ఞానం సాధించే దిశగా పునాదులు వేసుకోవాలి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో చేరడం లాభిస్తుంది. దీనివల్ల భావాన్ని వ్యక్తం చేసే కనీస సామర్థ్యం సొంతమవడంతోపాటు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అలవడతారుు.

దీంతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవడం కూడా కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా అకౌంటింగ్ ప్యాకేజ్‌లు, బీపీఓ ట్రైనింగ్, మెడికల్ ట్రాన్స్‌కిప్షన్, కాల్‌సెంటర్ వంటి అవకాశాలను కూడా ఎంచుకోవచ్చు.
..........................

ఎంబీఏ (హెచ్‌ఆర్‌ఎం) చేస్తున్నాను. దీంతో పాటు కెరీర్ మెరుగు కోసం చేయదగ్గ పార్ట్ టైమ్ కోర్సులను సూచించండి? - చరణ్, నిర్మల్

నేటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో వేగంగా ఎదగాలంటే.. అర్హత కోర్సులతోపాటు అదనపు కోర్సులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ అభ్యర్థులు కార్పొరేట్ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి కేంద్రీకరించాలి. అందులో భాగంగా పర్సనల్ స్కిల్స్, ఆప్టిమిజమ్, టైమ్ మేనేజ్‌మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషియబిలిటీ, బిజినెస్ కమ్యూనికేషన్, నెగోషియేషన్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్, లీడర్‌షిప్ వంటి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి.

అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అత్యవసరం. కాబట్టి ఈ అంశాలకు సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సులను చేయడం లాభిస్తుంది. అలాగే మీ కోర్సుకు సంబంధించిన నాలెడ్జ్ మరింత విస్తృతం చేసుకోవడానికి ఎస్‌ఏపీ (సాప్)-హెచ్‌ఆర్, సైకాలజీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ కోర్సులు చేయవచ్చు.

....................
పీజీ స్థాయిలో నానో టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -రవి, ఖమ్మం.

పరిశోధనల పరంగా విస్తృత పరిధి ఉన్న రంగం నానో టెక్నాలజీ. అణువు, పరమాణువుల సమ్మేళనమే నానో టెక్నాలజీ. దీని అనువర్తనాలను మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు, టెక్స్‌టైల్ పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
పీజీస్థాయిలో నానో టెక్నాలజీ ఆఫర్‌చేస్తున్న వర్సిటీలు:
జేఎన్‌టీయూ-హైదరాబాద్.
వివరాలకు: http://jntu.ac.in
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి: వివరాలకు: www.sssihl.edu.in
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -తమిళనాడు
వివరాలకు: www.vit.ac.in
అమిటీ యూనివర్సిటీ-నోయిడా
వివరాలకు: www.amity.edu
..........................

బీఈడీ పూర్తి చేశాను. టీచింగ్ కెరీర్‌లో స్థిర పడాలనుకుంటున్నాను. ఎంఎస్సీ/ ఎంఈడీలలో ఏ కోర్సు ఎంచుకోవాలి? -రమేశ్, కాకినాడ

బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలను కుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీని వల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా విద్యార్థులకు మరింత అవగాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది.

ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిర పడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహద పడు తుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయ వచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సును రెగ్యులర్/ డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.

మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ప్రిపరేషన్ ఇలా...


డైట్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే 8, 9, 10 తరగతుల స్టేట్ సిలబస్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ప్రశ్నపత్రం వెయిటేజ్‌ను పరిశీలిస్తే.. మొత్తం 100 మార్కుల్లో తెలుగు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో ప్రశ్నల వెయిటేజ్ ఎక్కువగా ఉంది. వీటిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. ఈ సబ్జెక్టులలో పాఠ్యపుస్తకాల చివరనున్న ముఖ్యాంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏదైనా మెటీరియల్ కంటే కూడా పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రతి చాప్టర్‌ను చదువుకుంటూ ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవడం లాభిస్తుంది.

సోషల్‌లో భారతదేశ జనాభా, శీతోష్ణస్థితి, మృత్తికలు, సహజ సంపద, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు మొదలైనవి; చరిత్రలో సింధు, ఆర్య నాగరికతలు, జైన, బౌద్ధ మతాలు, ఢిల్లీ సుల్తానులు, భారతదేశ జాతీయోద్యమం, వివిధ రాజవంశాలు, సిపాయిల తిరుగుబాటు, అతివాదులు-మితవాదులు; ఎకానమీలో ప్రణాళికలు-విజయాలు-అపజయాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి.

ఫిజికల్ సైన్స్‌లో ముఖ్యంగా విద్యుత్, కాంతి, ధ్వని, ఆధునిక భౌతికశాస్త్రం, మూలకాల వర్గీకరణ, ద్రావణాలు, రసాయనశాస్త్రం-పరిశ్రమలు వంటి అధ్యాయాలు; బయోలాజికల్ సైన్స్‌లో జీవనవిధానాలు, నియంత్రణ-సమన్వయం, ప్రత్యుత్పత్తి, పోషణ, మానవశరీర నిర్మాణం, రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రథమచికిత్స వంటి అంశాలపై దృష్టి సారించాలి. మ్యాథ్స్‌లో రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం, శ్రేఢులు, త్రికోణమితి, ప్రమేయాలు, వాస్తవ సంఖ్యలపై ఎక్కువ ఫోకస్ చేయాలి.

జనరల్ ఇంగ్లిష్‌లో ఆర్టికల్స్, ప్రిపోషిజన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, వెర్బ్ ఫామ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మొదలైనవాటిని ఔపోసన పట్టాలి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా క్రీడలు, అవార్డులు, వ్యక్తుల నియామకాలు, గ్రంథాలు-రచయితలు, భారత రాజ్యాంగాన్ని చదవాలి. ఇందుకోసం పరీక్షకు మూడు నెలల ముందున్న కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టి సారిస్తే సరిపోతుంది.

లెక్చర్‌షిప్‌నకు సువర్ణవకాశం.. ఏపీ సెట్


డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తిని చేపట్టే ప్రతి అభ్యర్థి సంబంధిత అకాడెమిక్ అర్హతలతోపాటు.. నిర్దేశించిన ఎలిజిబిలిటీ పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్), దాని తరహాలోనే కొన్ని రాష్ట్రాలు సొంతంగా స్లెట్(స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

గత కొంత కాలంగా స్లెట్ నిర్వహించకపోడంతో.. రాష్ట్ర విద్యార్థులకు లెక్చర్‌షిప్ సాధించేందుకు మిగిలిన ఏకైక అవకాశం.. యూజీసీ-నెట్. ఇంగ్లిష్ మీడియంలో ఉండడం.. సిలబస్ విస్తృతి, తదితర కారణాలతో మన తెలుగు విద్యార్థులకు నెట్ కష్టంగా ఉంటుందనే భావన నెలకొని ఉంది. దాంతో రాష్ట్ర విద్యార్థులు అనేక విలువైన అవకాశాలను కొల్పోతున్నారు.

నిరుద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తుండడంతో.. తిరిగి స్లెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో స్లెట్ పేరిట నిర్వహించిన ఈ పరీక్షను ప్రస్తుతం ఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)గా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు 13 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎలిజిబిలిటీ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది.

ఓయూకు బాధ్యతలు:
చాలా కాలం తర్వాత జరుగుతున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి దక్కాయి. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏపీసెట్-2012 నిర్వహణ కోసం ఓయూను స్టేట్ ఏజెన్సీగా గుర్తించింది. సంబంధిత నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ గత నెల 23న విడుదల చేసింది.

24 సబ్జెక్టులు.. తెలుగులోనూ పరీక్ష:
యూజీసీ-నెట్/సీఎస్‌ఐఆర్-నెట్ నిర్వహణ కోసం పాటించే ప్రమాణాల ఆధారంగానే ఏపీసెట్ జరుగుతుంది. పరీక్ష నిర్వహణ, సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, నాణ్యత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాల రూపకల్పన వంటి అంశాలన్నీ పూర్తిగా యూజీసీ-నెట్ మాదిరిగానే ఉంటాయి. ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో కలిపి మొత్తం 24 సబ్జెక్టులలో ఏపీసెట్‌ను నిర్వహిస్తున్నారు. కొన్ని సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలో, మరికొన్నిటిని కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే రాయాలి. ఎటువంటి వయోపరిమితి లేదు. ఎన్నిసార్లు అయినా ఏపీసెట్‌కు హాజరు కావచ్చు.

ఎగ్జామినేషన్ స్కీమ్:
ఏపీసెట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1,2,3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. మూడు పేపర్లకు కూడా ఒకే రోజు పరీక్ష ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్-1 ద్వారా టీచింగ్ ఆప్టిట్యూడ్‌ను పేపర్-2,3 ద్వారా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు.

పేపర్-1: అందరికీ కామన్‌గా ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో కనీసం 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 100. సమయం: గంట 15 నిమిషాలు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలో కూడా ప్రశ్నపత్రం ఉంటుంది. బోధన/పరిశోధనల పట్ల అభ్యర్థి అభిరుచిని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ఈ పేపర్.

ఇందులో తార్కిక సామర్థ్యం, విశ్లేషణ శక్తి, ఆలోచన విధానం,గ్రహణ శక్తి వంటి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులోని మొత్తం 60 ప్రశ్నల్లో.. 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పక్షంలో.. అభ్యర్థి సమాధానాలను గుర్తించిన మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు.

పేపర్-2: మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 100. సమయం: గంట 15 నిమిషాలు. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఈ పేపర్‌ను రూపొందించారు. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టులకు తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

పేపర్-3: మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 150. సమయం: రెండున్నర గంటలు. ఎంచుకున్న సబ్జెక్ట్‌పై అభ్యర్థి లోతైన అవగాహనను పరీక్షించడం.. ఆ సబ్జెక్ట్‌లోని స్పెషలైజేషన్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నలు వస్తాయి. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టులకు తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

సిలబస్ ఒకటే: జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ-నెట్, యూజీసీ-సీఎస్‌ఐఆర్-నెట్ పరీక్షల కోసం పేర్కొన్న సిలబస్‌నే..ఏపీసెట్ కోసం అనుసరిస్తున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ కార్బన్ ప్రింట్ అవుట్లను తమ వెంట తీసుకెళ్లొచ్చు.

అర్హత మార్కులు: మూడు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి.. పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్‌లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కటాఫ్ మార్కుల ఆధారంగా లెక్చరర్‌షిప్‌ను ప్రదానం చేస్తారు.

అర్హత మార్కులు
కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3
జనరల్ 40 40 75
బీసీ 35 35 67.5
పీహెచ్/వీహెచ్/
ఎస్సీ/ఎస్టీ 35 35 60


ఏపీసెట్-2012 సమాచారం:
అర్హత: 55 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/వీహెచ్ అభ్యర్థులకు 50 శాతం) సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. నిబంధనలకనుగుణంగా చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.700, బీసీ- రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/వీహెచ్-రూ.250. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి. సంబంధిత చలానాను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి,గుంటూరు, అనంతపురం, కడప, కర్నూలు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు, బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన చిరునామాకు తప్పనిసరిగా పంపాలి.

ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: మే 3, 2012.
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు: మే 30, 2012.
అపరాధ రుసుం రూ.100తో దరఖాస్తు:
జూన్ 1 నుంచి 5 తేదీ వరకు
అపరాధ రుసుం రూ.200తో దరఖాస్తు:
జూన్ 6 నుంచి 10 తేదీ వరకు.
ప్రింట్ అవుట్ హార్డ్ కాపీ(సంబంధిత సర్టిఫికెట్లతో కలిపి) స్వీకరణ కు చివరి తేదీ: జూన్ 13, 2012.
పరీక్ష తేదీ: జూలై 27, 2012.
వెబ్‌సైట్: www.apset.org
........................

ఆగస్టు 16లోగా సెట్ ఫలితాలు

సెట్ నిర్వహణకు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు రెండు సెట్ల చొప్పున ప్రశ్న పత్రాల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించాం. దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన సుమారు వేయి మంది ప్రొఫెసర్లు ఈ ప్రక్రియలో పాల్పంచుకోనున్నారు. ప్రశ్న పత్రాల స్థాయి యూజీసీ నెట్ తరహాలోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గట్టిగా శ్రమించాల్సిందే.

సెట్ పరీక్షకు సంబంధించి మోడల్ ప్రశ్న పత్రాలను ప్రత్యేకంగా విడుదల చేసే ఆలోచనలేదు. అభ్యర్థులు యూజీసీ నెట్ పరీక్ష పత్రాన్ని ఫాలో అవ్వాల్సిందే. ప్రశ్న పత్రాలు తెలుగులో ఉండడం మాత్రమే కొంచెం కలిసొచ్చే విషయం. సబ్జెక్టులో ఉన్నతస్థాయి ప్రిపరేషన్ చేయాలనేదే అభ్యర్థులకు నా సలహా. సెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కో రీజియన్‌లో నాలుగు చొప్పున మొత్తం 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నాం.

చాలా సంవత్సరాల తర్వాత సెట్ నిర్వహిస్తున్నందున 50 వేల నుంచి 60 వేల వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనా. ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీషు, కామర్స్ తదితర సబ్జెక్టులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పరీక్ష తర్వాత 15 నుంచి 20 రోజుల్లోగా ఫలితాలు వెల్లడిస్తాం.

ఇక.. సెట్ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల పరీక్ష వాయిదాకు సంబంధించి ప్రభుత్వం నుంచి, ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి సంకేతాలు రావడంలేదు. సెట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు చాలామంది డీఎల్ పరీక్షను వాయిదా వేయించాలని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. -ఎస్.సత్యనారాయణ, ఏపీ సెట్ ఛైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్

డైట్‌సెట్‌లో మంచి ర్యాంకు సాధించండిలా...


ఇంటర్‌తోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే కోర్సు... డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ). ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులని.. వారితోనే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో ఈ కోర్సు చేసినవారి భవిష్యత్ బంగారం కానుంది. డీఈడీలో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డైట్‌సెట్ రాయాలి. ఈ నేపథ్యంలో డైట్‌సెట్-2012కు ప్రిపరేషన్ వ్యూహాలు..

అర్హత : 45 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చేసినవారు డైట్‌సెట్‌కు అర్హులు కాదు. వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2012 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

సీట్ల వివరాలు:
రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో తెలుగు మీడియానికి సంబంధించి ప్రతి కళాశాలకు 100 సీట్లు ఉన్నాయి. అంటే.. మొత్తం 2300 సీట్లు. ఇక ప్రైవే ట్ డైట్ కళాశాలలు దాదాపు 201. వీటిల్లో ప్రతి కళాశాలలో దాదాపు 50 సీట్లు చొప్పున 10,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశపరీక్ష: ఆబెక్టివ్ విధానంలో రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు(వంద మార్కులు). ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి స్టేట్ సిలబస్ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది.

ఉన్నత విద్య: డీఈడీతో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉన్నత కోర్సులు చదవడం ద్వారా కెరీర్‌ను మరింత ఉన్నతంగా చక్కదిద్దుకోవచ్చు. ఎస్‌జీటీగా రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసిన అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉంటే దూరవిద్య విధానంలో బీఈడీ చేయొచ్చు. బీఈడీతో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌కు అర్హత లభిస్తుంది. ఆ తర్వాత పీజీ కూడా పూర్తిచేస్తే జూనియర్ లెక్చరర్ స్థాయికి చేరుకోవచ్చు. దూరవిద్య విధానంలో ఎంఈడీ, ఎంఏ (ఎడ్యుకేషన్) వంటి ఉన్నత కోర్సులు పూర్తిచేయొచ్చు.

ఈ కోర్సులను దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు దూరవిద్య విధానంలో ఆఫర్ చేస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు.. సంతృప్తికరంగా జీతభత్యాలు పొందేందుకు ఉపాధ్యాయ వృత్తి కేరాఫ్‌గా నిలిచింది. పరిమిత పని గంటలు, విధి నిర్వహణ అధ్యయనంతో ముడిపడి ఉండటం మరే ఉద్యోగం విషయంలోనూ సాధ్యం కాదు. అందువల్లే గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి టీచర్ ఉద్యోగం బాగా ఉపకరిస్తోంది.

డీఈడీతో కెరీర్: డీఈడీ పూర్తిచేసినవారికి అద్భుత అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ 70 శాతం పోస్టులను సెకండరీగ్రేడ్ టీచర్లకు పదోన్నతిపై కల్పించనున్నారు. నర్సరీలు, కాన్వెంట్లలలో బోధించాలంటే డీఈడీ అభ్యర్థులు తప్పనిసరి. ప్రస్తుత డీఎస్సీలో మొత్తం 11 వేలకుపైగా ఎస్‌జీటీ పోస్టులున్నాయి. కానీ డీఈడీ ఉత్తీర్ణులు రాష్ట్రంలో 60 వేలకు మించిలేరు.

దీంతో ఒక్కో పోస్టుకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య 1:5గా ఉంది. ఈ నేపథ్యంలో కొంచెం కష్టపడ్డా సులువుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలం. బీఈడీ చేసిన ఉపాధ్యాయులు, సీనియారిటీ ప్రాతిపదికపై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ), డిప్యూటీ డీఈఓ స్థాయి వరకూ పదోన్నతులు పొందొచ్చు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: ఏపీ ఆన్‌లైన్/ఈసేవా కేంద్రాల్లో * 200 ఫీజు చెల్లించాలి.

ముఖ్య తేదీలు:
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 9, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2012
పరీక్ష తేదీ: జూలై 8, 2012; 10.30 నుంచి 12.30 వరకు
వెబ్‌సైట్: http://dietcet.cgg.gov.in