Sunday, November 25, 2012

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...


లైబ్రరీస్... రిజర్వాయర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్’.. గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు ఈ ఒక్క వాక్యం చాలు. సప్త సముద్రాలకు మించి ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రదేశాలు గ్రంథాలయాలు. ఆ గ్రంథాలయాలను సమర్థంగా నిర్వహించడం; సమాచారాన్ని పొందిగ్గా అమర్చడం; అడిగిన వెంటనే సదరు సమాచారాన్ని అందించడం అనుకున్నంత సులభమేమీ కాదు. అందుకే ఈ లక్షణాలు, నైపుణ్యాలు అందించేందుకు రూపొందిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఆధునిక యుగంలో ఒక్కో అంశంపై పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు, రిఫరెన్స్‌లు పెరుగుతుండటంతో లైబ్రరీలను సమర్థంగా నిర్వహించే సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ రోజురోజుకీ పెరుగుతోంది. వినూత్న ఆలోచన, సహనం ఉన్న వారికి చక్కగా సరిపడే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...

‘అరల్లో పుస్తకాలను అమర్చడం.. అడగగానే అందించడం’.. లైబ్రరీలు, అందులో పనిచేసే సిబ్బంది విషయంలో సాధారణంగా నెలకొనే అభిప్రాయమిదే. కానీ ‘ఆ.. అడగగానే అవసరమైన పుస్తకాన్ని అందించడమే’ ఓ ఆర్ట్. సాధారణ వ్యక్తికి సాధ్యంకాని సైన్స్. అందుకే లైబ్రరీ నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.

ఉదాహరణకు: హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో లక్షల్లో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి తనకు కావలసిన పుస్తకం కోసం గంటలకొద్దీ అన్వేషణ సాగిస్తున్నాడు. దీన్ని గమనించిన లైబ్రేరియన్.. ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఏం కావాలో కనుక్కున్నాడు. క్షణాల్లో ఆ పుస్తకం ఆ వ్యక్తి చేతిలోకొచ్చింది. సాధారణ వ్యక్తికి సాధ్యం కానిది లైబ్రేరియన్‌కు క్షణాల్లో సాధ్యమవడానికి కారణం.. అతడు లైబ్రరీ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత సాధించడమే.

ప్రఖ్యాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైతం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అసోసియేట్‌షిప్‌ను అందిస్తోందంటే ఈ కోర్సు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సైతం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరరీస్‌ను రూపొందించాలని సిఫార్సు చేసిందంటే లైబ్రరీలు, ఈ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు.

కోర్సు స్వరూపం:
సాధారణంగా లైబ్రరీ సైన్స్ కోర్సులో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ సిస్టమ్స్, బిబ్లియోగ్రఫీ, డాక్యుమెంటేషన్, మెయింటెనెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్, లైబ్రరీ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఆర్కైవ్స్ మేనేజ్‌మెంట్, ఇండెక్సింగ్, లైబ్రరీ ప్లానింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది.

కన్వెన్షన్ టు కంప్యూటరైజేషన్: కాలంతోపాటు లైబ్రరీ సైన్స్ కోర్సు స్వరూపం కూడా మారుతోంది. ఆధునిక కంప్యూటర్ యుగం నేపథ్యంలో.. గతంలో సంప్రదాయంగా పుస్తకాలు, జర్నల్స్ వంటి వాటి నిర్వహణకే పరిమితమైన శిక్షణ ఇప్పుడు సీడీలు, డీవీడీలు, మైక్రోఫిల్మ్స్ సేకరణ, శాస్త్రీయపద్ధతుల్లో సంరక్షణ వరకు పొడిగింది.

స్పెషలైజేషన్స్‌తో స్పెషల్‌గా..:
ఇప్పుడు ప్రతికోర్సు, ప్రతి విభాగంలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఆ మాట లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కూ విస్తరించింది. ఈ క్రమంలో మెడికల్ లైబ్రేరియన్, లా ఫర్మ్ లైబ్రేరియన్, మ్యూజియం లైబ్రరీస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు, లీగల్ పబ్లిషింగ్ హౌసెస్; మ్యూజియంలు ఆఫర్లు ఇవ్వడంలో ముందుం టాయి. మెడికల్ లైబ్రేరియన్ స్పెషలైజేషన్ చేస్తే క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, ఫార్మా సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.

అవకాశాలు అపారం:
చాలామంది ఇప్పటికీ ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. కానీ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. కారణం.. పెరుగుతున్న డాక్యుమెంటేషన్ సెంటర్లు, మ్యూజియంలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ముద్రణ సంస్థలు, రీసెర్చ్ సంస్థల్లో లైబ్రేరియన్ల కొరత వేధిస్తుండటమే! ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో అవకాశాలు కోకొల్లలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా 2008లో నిర్వహించిన ఎంప్లాయ్‌మెంట్ సర్వేలో ‘బెస్ట్ కెరీర్స్ ఆఫ్ 2008’ జాబితాలో ఈ కోర్సు స్థానం పొందిందంటే దీనికి గల అవకాశాలు అర్థం చేసుకోవచ్చు.

అవకాశాల వేదికలు:
ఈ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీలే కాకుండా అనేక ఇతర విభాగాలు అవకాశాల వేదికలుగా నిలుస్తున్నాయి. అవి.. పబ్లిక్/ ప్రభుత్వ లైబ్రరీలు; విద్యా సంస్థలు; విదేశీ రాయబార కార్యాలయాలు; జాతీయ స్థాయి మ్యూజియంలు, పురాతత్వ శాఖలు. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్; డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ); ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్); ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వంటి సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి.

కార్పొరేట్ సెక్టార్‌లోనూ!
లైబ్రరీ సైన్స్ కోర్సు ఉత్తీర్ణులకు కార్పొరేట్ సంస్థలు సైతం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయనడం అతిశయోక్తికాదు. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో వీరి అవసరం పెరుగుతోంది. విస్తృతమైన సమాచారాన్ని పొందిగ్గా అమర్చడానికి సంబంధిత విభాగంలో సుశిక్షుతులైన సిబ్బంది అవసరం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో ఆయా సంస్థల నిరంతర కార్యకలాపాలైన డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డిజైన్, ఇంటర్నెట్ కోఆర్డినేషన్ వంటి విభాగాల్లో లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు
న్నాయి.

కెరీర్ గ్రాఫ్:
ఈ విభాగంలో కెరీర్ గ్రాఫ్.. పూర్తి చేసిన కోర్సుపై ఆధారపడి ఉంటుంది. డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీ క్లర్క్ లేదా లైబ్రరీ అటెండెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఇలా పలు స్థాయిల్లో కెరీర్ గ్రాఫ్ ఉంటుంది. అవి.. లైబ్రరీ అటెండెంట్/అసిస్టెంట్ లైబ్రేరియన్; డిప్యూటీ లైబ్రేరియన్; లైబ్రేరియన్/చీఫ్ లైబ్రేరియన్; రీసెర్చర్/అప్లికేషన్ స్పెషలిస్ట్; కన్సల్టెంట్/రిఫరెన్స్ లైబ్రేరియన్; టెక్నికల్ అసిస్టెంట్/ రికార్డ్స్ మేనేజర్; ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ వంటివి.

వేతనాల వెల్లువ:
కోర్సు పూర్తి చేసిన వారికి వేతనాలు కూడా వెల్లువలా లభిస్తాయని చెప్పొచ్చు. విద్యా సంస్థల్లో లైబ్రేరియన్లుగా చేరిన వారికి యూజీసీ స్కేల్ అందిస్తారు. డీఆర్‌డీఓ, ఇస్రో వంటి పరిశోధన సంస్థల్లో చేరిన వారికి సైంటిఫిక్ సిబ్బందికి సమాన స్థాయిలో వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విభాగాల్లో చేరితే ప్రారంభంలోనే అయిదంకెల జీతం గ్యారెంటీ. ఇతర విభాగాల్లో చేరిన వారికి ప్రారంభంలో కనీసం నెలకు రూ. 15 వేల జీతం ఖాయం.

విధులివే:
లైబ్రేరియన్ విధులు..
- వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడం
- సబ్జెక్ట్ ఆధారంగా ప్రచురణల కొనుగోలు, లైబ్రరీలో అమరిక
- లైబ్రరీ నిర్వహణ, సిబ్బందిపై పర్యవేక్షణ
- పుస్తకాలు, రాతప్రతులు, ప్రత్యేక ప్రచురణల సేకరణ, సంరక్షణ

వ్యక్తిగత లక్షణాలు:
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో అడుగుపెట్టే వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. అవి పుస్తకాలపై ప్రేమ; నూతన ప్రచురణలపై నిరంతర అన్వేషణ; చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్; సహనం; వ్యక్తుల అవసరాలను గుర్తించి సహకరించడం వంటివి.

మన రాష్ట్రంలో:
ఇక.. ఈ కోర్సును మన రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) స్థాయిలోనే అందిస్తున్నాయి. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, లేదా ప్రత్యేక ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు దూర విద్యా విధానంలోనూ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తున్నాయి. జాతీయ స్థాయి ఓపెన్ యూనివర్సిటీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) సర్టిఫికెట్ నుంచి ఎం.ఫిల్ స్థాయి వరకు ఈ కోర్సును దూర విద్యా విధానంలో అందిస్తోంది.

మాస్టర్ డిగ్రీకి సమానంగా అసోసియేట్‌షిప్:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR -న్యూఢిల్లీ; ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరులు.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీకి సమాన హోదాలో డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో రెండేళ్ల వ్యవధిగల అసోసియేట్‌షిప్ ప్రోగ్రాంను అందిస్తున్నాయి.

సర్టిఫికెట్ టు రీసెర్చ్

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోగానే తలెత్తే ప్రశ్న.. కోర్సులేంటి? అనేదే. ప్రస్తుతం మన దేశంలో 80కి పైగా యూనివర్సిటీలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా కోర్సులను నిర్వహించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR), ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ (INSD-OC)లు ఈ కోర్సు విషయంలో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అందించే కోర్సులు సర్టిఫికెట్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉంటున్నాయి. ఆ వివరాలు..

= సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఇంటర్మీడియెట్.
= డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఇంటర్మీడియెట్.
= బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(బీఎల్‌ఐఎస్‌సీ); అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ; వ్యవధి: ఏడాది.

= మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత; వ్యవధి: ఏడాది.
= ఎం.ఫిల్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
= పీహెచ్‌డీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్; అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.
= సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల కాల వ్యవధి ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల విధానాల మేరకు ఉంటుంది. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సు ఆరు నెలలు, డిప్లొమా కోర్సు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో సాగుతుంది.

ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?


ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-పూజిత, జడ్చర్ల.
మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్‌మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న సంస్థలు, మీడియా హౌస్‌లు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సినీ తారలు, సెలెబ్రెటీస్, రచయితలు, సంగీత దర్శకులకు, క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తులకు మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరించవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి వేతనాలు కూడా అదే మాదిరిగానే ఉంటున్నాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ. 15,000-30,000 మధ్య ఉంటుంది.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
= శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తిరుపతి
వెబ్‌సైట్: www.spmvv.ac.in/
= ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా
వెబ్‌సైట్: www.aaft.com
= ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.imcsindia.com
= మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ - బెంగళూరు
వెబ్‌సైట్: www.manipal.edu
= ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టడీస్ - న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.isomes.com
= అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ - నోయిడా
వెబ్‌సైట్: www.amity.edu
= ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ- న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in/


కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ వివరాలను తెలపండి?
-చరణ్, గద్వాల.
కంైబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/మంత్రిత్వ శాఖ ల్లోని అసిస్టెంట్లు/అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ); సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ప్రివెంటివ్ ఆఫీసర్; ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్లు; సీబీఐలో సబ్-ఇన్‌స్పెక్టర్లు; సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్‌లలో ఇన్‌స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్స్; డెరైక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో.. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు; కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ఆఫీస్‌లో.. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్/జూనియర్ అకౌంటెంట్/అకౌంటెంట్/అడిటర్స్; స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటింగ్ మంత్రిత్వ శాఖలో.. స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-2, తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షకు హాజరు కావడానికి కావల్సిన అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 27 ఏళ్లు. ఇన్‌స్పెక్టర్/సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్.. టయర్-1, టయర్-2 అనే రెండు దశలుగా ఉంటుంది.
టయర్-1: ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి.. జనరల్ ఇంటలిజెన్స్ (50 మార్కులు); జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు); న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు); ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (50 మార్కులు); ఈ దశలో క్వాలిఫై అయిన వారిని మాత్రమే తర్వాతి దశ.. టయర్-2 కు అనుమతిస్తారు.

టయర్-2: ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్‌కు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి.. ఆర్థమెటిక్ ఎబిలిటీస్ (200 మార్కులు-సమయం రెండు గంటలు); ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (200 మార్కులు-సమయం రెండు గంటలు); కంపైలర్/స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-2 పోస్టుకు ‘స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్’ పేపర్ అదనంగా ఉంటుంది (200 మార్కులు-సమయం రెండు గంటలు); ఈ రెండు దశల్లో క్వాలిఫై అయిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్.. నిర్దేశించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ నిర్వహించి నియామకం ఖరారు చేస్తారు.
వెబ్‌సైట్: http://ssc.nic.in

గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు వివరాలను తెలపండి?
-గణేష్, కర్నూలు.
గ్రాఫిక్ డిజైనింగ్ అనేది విజువల్ కమ్యూనికేషన్‌లోని ఒక ప్రక్రియ. అందుబాటులోని సమాచారాన్ని పదాలు, చిత్రాలు (images) ఉపయోగించి ప్రభావవంతంగా ప్రజెంట్ చేయడమే గ్రాఫిక్ డిజైన్. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి.. డ్రాయి ంగ్, లే అవుట్, టైపోగ్రఫీ, లెట్టరింగ్, డయాగ్రమింగ్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి.

వివిధ పత్రికలు, కార్పొరేట్ రిపోర్ట్స్, జర్నల్స్, మార్కెటింగ్ బ్రోచర్స్ లే అవుట్ డిజైన్ చేయడం, వ్యాపార-వాణిజ్య ఉత్పత్తులకు సంబంధించిన లోగోలను రూపొందించడం వంటి విధులను గ్రాఫిక్ డిజైనర్లు నిర్వహిస్తుంటారు. వీరికి మీడియా హౌస్‌లు, పబ్లికేషన్ సంస్థలు, యాడ్ ఏజెన్సీలు, కార్పొరేట్ హౌసెస్‌లు కెరీర్ అవె న్యూస్‌గా నిలుస్తున్నాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
= నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
వెబ్‌సైట్: www.nid.edu
= ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్-ఐఐటీ బాంబే
వెబ్‌సైట్: www.idc.iitb.ac.in
= ఐఐటీ-కాన్పూర్
వెబ్‌సైట్: www.iitk.ac.in
= ఐఐటీ-గువహటి
వెబ్‌సైట్: www.iitg.ac.in
= సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే
వెబ్‌సైట్: sid.edu.in
ఇవే కాకుండా తపస్ మల్టీమీడియా, ఎరెనా, జీ ఇన్‌స్టిట్యూట్ వంటి ఎన్నో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు గ్రాఫిక్ డిజైన్ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

ఉపకార వేతనాలు


దేశ, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనేది ప్రతి విద్యార్థి కల. కానీ చాలా మంది విద్యార్థులకు ఆర్థిక లేమి. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నో వర్సిటీలు/సంస్థలు మేమున్నామంటూ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. వాటి వివరాలు..

యూజీసీ పీజీ స్కాలర్‌షిప్ ఫర్ ఎస్సీ/ఎస్టీ
ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూజీసీ అందించే స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిని 2012-13 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ మొదలైన కోర్సులను రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారికి అందిస్తారు.

మొత్తం స్కాలర్‌షిప్స్: 1000
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/ కళాశాలల్లో పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుండాలి. దూరవిద్య ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను ఇవ్వరు.

వయో పరిమితి: పురుషులకు జూలై 1, 2012 నాటికి 45 ఏళ్లు మించరాదు. మహిళలకు గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు.

స్కాలర్‌షిప్ వ్యవధి: కోర్సును బట్టి రెండు/మూడేళ్లు
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంఈ/ఎంటెక్ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ. 5000, ఇతర పీజీ కోర్సులు చదువుతున్న వారికి నెలకు రూ.3000 స్కాలర్‌షిప్‌తోపాటు కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఎంఈ/ఎంటెక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15000, ఇతరులకు ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 6, 2012
వెబ్‌సైట్: www.ugc.ac.in/pgsprof/


మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్స్-2013

ఇంగ్లండ్‌లోని సెయింట్ జాన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్‌లో డాక్టోరల్ కోర్సులు చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్స్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. సెయింట్ జాన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్ధం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండి పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి.
- డిసెంబర్ 31, 2012 నాటికి 35 ఏళ్లు మించరాదు.
- ఇంగ్లిష్‌లో రాయగలిగి, మాట్లాడగలిగి ఉండాలి.
- ఇప్పటివరకు యూకే ప్రభుత్వం అందించే ఎలాంటి స్కాలర్‌షిప్/ఆర్థిక సహాయాన్ని పొంది ఉండకూడదు.
- గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టులలో యూజీ, పీజీలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లీడర్‌షిప్ క్వాలిటీస్ (ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా సంబంధిత సబ్జెక్టులలో విద్యార్థి తాను చేసిన కృషి.. దానికి సంబంధించి ఏదైనా పబ్లికేషన్స్‌లో ప్రచురితమైతే వాటి వివరాలు) తెలిపేలా ఆధార పత్రం.
- సెప్టెంబర్/అక్టోబర్ 2013 నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ-యూకేలో ప్రారంభమయ్యే డాక్టోరల్ కోర్సులు చదవడానికి ఆసక్తి కలిగి ఉండాలి.

స్కాలర్‌షిప్ ద్వారా అందేవి: అకడెమిక్ ఫీజులు, రానూపోను విమాన ఖర్చులు, యూకేలో నివసించడానికి నెలవారీ ఖర్చులు, యూకే వీసా.

ఎంపిక విధానం: విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా బ్రిటిష్ కౌన్సిల్ షార్ట్‌లిస్ట్ చేస్తుంది. వీరికి న్యూఢిల్లీలో నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:డిసెంబర్ 31, 2012
వెబ్‌సైట్: www.britishcouncil.org


ఖొరానా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్

అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీతోపాటు దానితో భాగస్వామ్యమున్న ఇతర అమెరికన్ వర్సిటీల్లో బయోటెక్నాలజీ.. సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే ఖొరానా స్కాలర్‌షిప్‌కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ స్కాలర్‌షిప్‌ను 2013 సంవత్సరానికి గానూ విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ (యూఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ, ఇండియా), ఇండియా-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం కలిసి అందిస్తున్నాయి.

కోర్సును అందిస్తోన్న అమెరికన్ యూనివర్సిటీలు:
- యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్
- యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్
- యూనివర్సిటీ ఆఫ్ లోవా
- యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్
- మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా
- ఇండియానా యూనివర్సిటీ
- జార్జిటౌన్ యూనివర్సిటీ-బ్లూమింగ్‌టన్
- మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)

అర్హత:
- ఇండియాలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాలల్లో బయోటెక్నాలజీ.. దాని సంబంధిత (అగ్రికల్చర్, హెల్త్, బయోమెడికల్ సెన్సైస్) అంశాల్లో బీటెక్/ఎంటెక్/ఎమ్మెస్సీ చదువుతుండాలి.
- యూఎస్‌లోని సంబంధిత యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో రీసెర్చ్ చేసేందుకు ఆసక్తి ఉండాలి.

స్కాలర్‌షిప్ వ్యవధి: 10 వారాలు (మే-జూలై 2013)
స్కాలర్‌షిప్ ద్వారా: ఎయిర్‌ఫేర్, స్టైఫండ్, ఉచిత వసతి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి scholar@indousstf.org కు మెయిల్ చేయాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్‌సైట్: http://indousstf.org


యూజీసీ-ఫీనిష్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్
2013-14 విద్యా సంవత్సరానికి ఫిన్‌లాండ్‌లో రీసెర్చ్ కోర్సులు, డాక్టోరల్ స్టడీస్ చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫిన్‌లాండ్ ప్రభుత్వం స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.
మొత్తం స్కాలర్‌షిప్స్: 10

అర్హతలు:
- భారతీయ పౌరులై ఉండాలి.
- మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేముందు ఫిన్‌లాండ్ అకడెమిక్ సూపర్‌వైజర్ నుంచి ఆహ్వానం అందుకుని ఉండాలి.
- ఇంగ్లిష్/స్వీడిష్/ఫీనిష్ లాంగ్వేజీల్లో దేనిలోనైనా రైటింగ్, స్పీకింగ్ సామర్థ్యం అవసరం.

స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు 1200 యూరోల చొప్పున ఏడాదిపాటు చెల్లిస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు రానుపోను ఎయిర్‌ఫేర్ ఛార్జీలను యూజీసీ చెల్లిస్తుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు స్టడీ రీసెర్చ్ ప్లాన్, సీవీ, రెండు రికమండేషన్ లెటర్స్, విద్యార్హతలను తెలిపే సర్టిఫికెట్ల కాపీలను ఈ దిగువ చిరునామాకు పంపాలి.

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
సెక్షన్ ఆఫీసర్ (ఐసీ), రూమ్ నెంబర్-508 ఏ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, బహదూర్‌షా జాఫర్ మార్గ్, న్యూఢిల్లీ-110002
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
వెబ్‌సైట్స్: www.ugc.ac.in, www.studyinfinland.fi


రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్

విదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో రీసెర్చ్ చేస్తున్న భారతీయులకు అందించే రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్‌నకు నోటిఫికేషన్ వెలువడింది. దీన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) అందిస్తోంది. విదేశాల్లో బయోటెక్నాలజీ సంబంధిత అంశాల్లో (అగ్రికల్చర్, హెల్త్ సెన్సైస్, బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, బయో ఇన్ఫర్మేటిక్స్ మొదలైనవి) రీసెర్చ్ చేస్తున్నవారికి ఈ ఫెలోషిప్‌లు అందిస్తారు.

అర్హత: పీహెచ్‌డీ/ఎండీ/ఎంటెక్/ఎంవీఎస్సీలలో మంచి అకడెమిక్ రికార్డుతో ఉత్తీర్ణత సాధించడంతోపాటు విదేశాల్లో ఆర్ అండ్ డీ సంస్థల్లో మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అనుభవం తప్పనిసరి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చి మన దేశంలో ఇక్కడే పని చేస్తున్న భారతీయులకు ఈ ఫెలోషిప్ అందించరు.
వయో పరిమితి: నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి 55ఏళ్లు మించరాదు.

ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు
ఫెలోషిప్: ఫెలోషిప్‌నకు ఎంపికైనవారిని ఫ్యాకల్టీగా, వివిధ ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూషన్స్‌ల్లో సైంటిస్ట్-డీ విభాగంలో శాస్త్రవేత్తగా నియమిస్తారు. రెమ్యునరేషన్‌గా నెలకు రూ.75,000 అందించడంతోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కింద నెలకు రూ.7500 చెల్లిస్తారు. అంతేకాకుండా కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద మొదటి ఏడాది రూ.10 లక్షలు, రెండో ఏడాది రూ.7.5 లక్షలు, మూడో ఏడాది రూ.5 లక్షలు అందిస్తారు. వీటిని ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు, సెమినార్‌లకు హాజరు కావడానికి, రీసెర్చ్‌కు అవసరమైన మానవ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. వీటితోపాటు వైద్య సౌకర్యం, రవాణా భత్యం, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన సదుపాయాలు అందిస్తారు.

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో ఉన్న దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి ఈ దిగువ చిరునామాకు పంపాలి.
డాక్టర్ మీనాక్షి మున్షీ, డెరైక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ,
బ్లాక్-2, 7వ ఫ్లోర్, సీజీఎం కాంప్లెక్స్, లోఢీ రోడ్, న్యూఢిల్లీ-110003
ఈ-మెయిల్: rlsfellowship.dbt@nic.in
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబర్ 31, 2012
వెబ్‌సైట్: www.dbtindia.nic.in

ఎన్‌బీహెచ్‌ఎం స్కాలర్‌షిప్స్

2013-14 విద్యా సంవత్సరానికి మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చదవాలనుకునే విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్‌బీహెచ్‌ఎం) స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.

అర్హత:
- మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఏ/బీఎస్సీ/బీటెక్/బీఈ/ఎంఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత లేదా సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

- 10+2 నుంచి డిగ్రీ/పీజీ వరకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ద్వితీయ శ్రేణితో బీఎస్సీ(ఆనర్స్)ఉత్తీర్ణులు అర్హులే.
- పీహెచ్‌డీ (మ్యాథ్స్) కోసం ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసుకుని ఉండాలి.

స్కాలర్‌షిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000, ఆ తర్వాత సంవత్సరాల్లో నెలకు రూ.18000లతోపాటు ఏడాదికి రూ.20,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. వీటితోపాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా అందిస్తారు.

స్కాలర్‌షిప్ వ్యవధి: నాలుగేళ్లు. విద్యార్థి ప్రతిభను బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-అలహాబాద్, ఐఐఎస్‌ఈఆర్ (పుణె) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పీహెచ్‌డీ మ్యాథ్స్ చదవడానికి ఈ పరీక్ష తప్పనిసరి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులో విజయం సాధించినవారిని స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మ్యాథ్స్‌పై పీజీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పాత ప్రశ్నపత్రాల కోసం www.nbhm.dae.gov.in చూడొచ్చు.

మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా ఆధారంగా పూర్తిచేసిన దరఖాస్తును ఈ కింద చిరునామాకు పంపాలి.
ప్రొఫెసర్ ఈ.కేశవన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్, సీఐటీ క్యాంపస్, తారామణి, చెన్నై-600113. ఈ-మెయిల్: kesh@imsc.res.in

ముఖ్య తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2012
రాత పరీక్ష: జనవరి 19, 2013
వెబ్‌సైట్: www.nbhm.dae.gov.in